ఏపీకి హైఅలర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..!

ఆంధ్రప్రదేశ్ మరో తుఫాన్ ముంపు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబర్ 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈనెల 14న వాయుగుండంగా మారి, 15న తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. 

ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పేర్కొన్నారు. రేపటి నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్సాల నేపథ్యంలో జాల్లాల యంత్రంగాన్ని ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసింది.  

 

Leave a Comment