హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.. అయితే చట్టబద్ధత లేకుండానే హైడ్రా ఈ కూల్చివేతలు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది.
జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అనేక అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. అయితే హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించింది. ఈక్రమంలో హైడ్రాకు ఉన్న ఆటంకాలను ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించారు. జీహెచ్ఎంసీ చట్టం 1955 374బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేేశారు.
ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో అధికారాలను హైడ్రాకు బదలాయించారు. ఈ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైడ్రా ఆర్డినెన్స్ ఫైల్ పైసంతకం చేశారు. ఆపై గెజిట్‌ను విడదల చేశారు. గెజిట్ విడుదలతో హైడ్రాకు ఫుల పవర్స్ వచ్చేశాయి.