మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలంనగర్ లోని అతని కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి.
సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్నైల్ సింగ్(హర్యానా), ధరమ్ రాజ్ కశ్యప్(ఉత్తరప్రదేశ్)గా గుర్తించారు. సిద్ధిఖీ హత్యకు గత నెల రోజుల నుంచి మాటు వేసినట్లు విచారణలో తేలింది. బాంద్రాలోని ఆయన కుమారుడి ఇంటి వద్ద దుండగులు పలు మార్లు రిక్కీ నిర్వహించనట్లు పోలీసులు గుర్తించారు.
విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై దాడి జరిగింది. మీడియా కథనాల ప్రకారం రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిఖీ టపాసులు పేల్చుతుండగా ముగ్గురు దుండగులు ముఖానికి కండువా కప్పుకుని వాహనం నుంచి బయటకు వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. ఎన్సీపీ నేత కడుపు, ఛాతీలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఇది గమనించిన వారు సిద్ధిఖీని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.